Hyderabad Rains Today : హైదరాబాద్‌లో వరుస వర్షాల వేళ.. జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఆర్ఎఫ్, మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అవసరమైతే తప్ప నగర వాసులు ఇంటి నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Heavy Water Flood in Hussainsagar : ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. దీంతో 2,000 క్యూసెక్కులను అధికారులు దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.53 మీటర్లకు చేరింది. హుస్సేన్‌సాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అప్రమత్త చర్యలు చేపట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హుస్సేన్‌సాగర్‌తో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల వరకు నీటిని కిందకు వదులుతున్నట్లు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నాలాలు అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయని.. వాటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే వారికి పరిహారం కూడా ఇస్తామని వివరించారు. మరో వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయాలని.. సహాయక సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Rain Problems in Hyderabad : ఆగని వానలు.. నీట మునుగుతున్న కాలనీలు
"నాలాలు అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయి. హుస్సేన్‌సాగర్ నుంచి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. నాలాల వద్ద అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులున్నాయి. అక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే వారికి పరిహారం కూడా ఇస్తాం. వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి." - తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి
Heavy Water Flood Flow to Himayatsagar : అటు హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాలలో వర్షం దంచికొడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్‌పల్లి, షాద్‌నగర్, షాబాద్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఈసీ, మూసీ వాగులు పొంగుతున్నాయి. హిమాయత్‌సాగర్‌కు 3,500 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. పూర్తిస్థాయిలో నిండుకుంది. దీంతో 6 గేట్లు ఎత్తి.. 4,120 క్యూసెక్కుల మేరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఉస్మాన్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గానూ ప్రస్తుతం 1785.70 అడుగులకు చేరుకుంది.
ఇవీ చదవండి :