Heavy Rains in Hyderabad Today: రాష్ట్ర రాజధానిలో మరోసారి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులు చెరువుల్ని తలపించాయి. ఏకదాటిగా రెండుగంటలపాటు పడిన వానకి వాహనాలు గంటలతరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజీగూడ, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది.
విద్యుత్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి: సికింద్రాబాద్ కళాసీగూడలో 11 సంవత్సరాల బాలిక మౌనిక నాలాలో పడి దుర్మరణం చెందిన ఘటన మరువకముందే... తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద విద్యుదాఘాతంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వీరస్వామి యూసుఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్‌లో పనిచేసే.. తన తమ్ముడిని కలిసి తిరిగి ఇంటికి జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. వాహనంతో సహా విద్యుత్ స్తంభం సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడగా విద్యుత్ షాక్ తగిలింది. సమాచారం అందకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని.. సీపీఆర్ చేశారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
కూలిన చెట్లు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు: యూసుఫ్ గూడ డివిజన్ శ్రీ కృష్ణ నగర్‌ను వరద ముంచెత్తింది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తిలో వరదలో పడి కొట్టుకుపోతుండగా... స్థానికులు అతన్ని గుర్తించి రక్షించారు. ఇందిరాపార్కు వద్ద రోడ్డుపై భారీ వృక్షం కూలింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడకు చేరుకుని రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్నారు. ఫిలింనగర్, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్లు కూలి రోడ్డు పై పడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూలిన చెట్లను తొలగించారు.
మరో మూడు రోజులు వర్షాలు: పురాతన భవనాలు, ఇళ్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు ద్రోణి కొనసాగుతున్న కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే పాదచారులు, వాహనదారులు రహదారులపై రాకపోకలు సాగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: