రాగల 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాల్లో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోందని తెలిపింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. మహారాష్ట్ర తీరానికి దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. రాగల 48 గంటల్లో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకొని ఉన్న తూర్పు మధ్య, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడి.. క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.
వీటి ప్రభావంతో రాగల మూడ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి: వరదల ప్రభావంపై సీఎం కేసీఆర్ అత్యవసర, ఉన్నతస్థాయి సమీక్ష