Rain Aleart To Telangana Districts : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికిపాటి వానతో పలు ప్రాంతాలు తడిసిముద్దవుతున్నాయి. జిల్లాల్లోనూ జోరువానలతో ముసురుపట్టుకుంది. వరుణుడి కరుణతో.. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షీయర్ జోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు.
అన్ని జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ : హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో కూడా వానలు కురవనున్నాయని వాతావరణ విభాగ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
"సియర్ సూన్ ప్రభావం వల్ల వర్షాలు వస్తున్నాయి. ఉత్తరాదిన ఉన్నటువంటి నైరుతి రుతుపవనాల ద్రోణి.. కొంతమేరకు తెలంగాణ వైపు వచ్చింది. అల్పపీడనం ఏర్పడటంతో రానున్న నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా తేలిక పాటి వర్షాలు ఆగస్టు మొదటి వారం వరకు ఉండే అవకాశం ఉంది." - డాక్టర్. నాగరత్న, వాతావరణ శాఖ సంచాలకురాలు
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది : భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో జీహెచ్‌ఎంసీ ముందుగానే అప్రమత్తమైంది. మాన్‌సూన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతించకూడదని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి :