తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. శంషాబాద్, మెహదీపట్నం, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కీసర, చర్లపల్లి, నేరెడెమెట్, ఈసీఐఎల్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఓయూ, చార్మినార్, నాంపల్లి, కోఠి, అబిడ్స్, నాగోల్, హయత్‌నగర్, దిల్‌సుఖనగర్ ప్రాంతాల్లో వర్షం కురవడం వల్ల రహదారులన్నీ జలమయమయ్యాయి.
నీటిలో మునిగిన కార్లు, బైక్‌లు...
రోడ్డుపైకి వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజేంద్రనగర్‌లో కురిసిన వర్షానికి కార్లు, బైకులు వాన నీటిలో మునిగిపోయాయి. మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాలలో 3.6కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల అవర్తనం, షేర్‌జోన్‌లు విలీనమయ్యాయన్నారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇవీ చూడండి: 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది