Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వర్షం పడుతుంది. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహదీపట్నం, ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్‌సాగర్, ప్రాంతాల్లో వాన కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనం ఆలస్యం అవుతుంది. రహదారుల పైకి నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
జంట జలాశయాలకు భారీ వరద: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ శివారు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు జంట జలాశయాల రెండు గేట్లు ఎత్తి వరదను మూసీలోకి వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 442 క్యూసెక్కులుగా ఉంది.
రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
మహానగరంలో వాగులైన రహదారులు: గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వాగులను తలపించాయి. కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 6.8 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబిలో 6.4, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి
అసలే వర్షాకాలం.. ఇక ఈ నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత