భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి మద్దయింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసింది(rain in Hyderabad). నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి అటు శివారు మేడ్చల్ వరకు వర్షం పడింది. వర్షం కారణంగా వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, అల్కాపురి, నాగోల్, హయత్‌నగర్, జీడిమెట్ల, సురారం, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబ్దుల్లాపూర్ మెట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోయి వాహన చోదకులు, పాదచారులు సతమతమయ్యారు.
చిరువ్యాపారుల ఇక్కట్లు
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు, ఇతర వస్తువులు విక్రయించే వారు సతమతమయ్యారు.
భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
వర్షం ప్రభావంతో నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై గుంతల్లో నీరుచేరి ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షం కురుస్తున్నంతసేపు మెట్రో రైలు ఉన్న మార్గాల్లో వంతెనల కిందనే వాహన చోదకులు పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్రానికి వర్ష సూచన
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది(imd report). మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (weather report) అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: rain in telangana 2021 : కమ్ముకొచ్చిన కారుమేఘం.. జనజీవనం అతలాకుతలం