హైదరాబాద్‌పై వరుణ ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు గంట పాటు పలుచోట్ల భారీ వాన పడింది. కూకట్ పల్లి, మియాపూర్, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, వనస్థలిపురం, బాగ్ లింగం పల్లి, తార్నాక, జీడిమెట్ల, కోఠి, ముషీరాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కుషాయిగూడతో పాటు శివారును ఉన్న చేవెళ్లలో కూడా భారీ వర్షం పడింది.
బాగ్ లింగంపల్లిలో ప్రధాన రహదారి వరద నీటితో నిండిపోయింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదురుగా మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు వాహనాలు వీటిలో కొట్టుకుపోయారు.
హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి వనస్థలిపురం, పనామా కూడలి నుంచి సుష్మా వరకు రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరింది. అదే విధంగా భాగ్యలత నుంచి ఆటోనగర్ వరకు విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు వచ్చి చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. కూకట్ పల్లిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడింది. రోడ్లపైకి భారీగా వాన నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అంబర్ పేట వద్ద మూసినది ప్రవహిస్తోంది. మురుగు నీటి కాలువలు నిండిపోయి.. ఆ వరదంతా రోడ్లపైకి చేరింది.
ఈ కథనం చదవండి: టాయ్లెట్లో ఫోన్ వాడుతున్నారా? మీకు పైల్స్ వస్తాయ్!