Telangana Rains Latest News Today : వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు.. రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు జిల్లాల్లో వరద విలయతాండవం చేయడంతో.. జనజీవనం తలకిందులైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగా జరిగింది. లక్షల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతుల ఆవేదనకు అవధుల్లేకుండా పోయింది. భారీ ఎత్తున రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరింది. పలు చోట్ల వంతెనలు కూలిపోయాయి. ఆదివారం వరకు నష్టంపై పూర్తి నివేదిక అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు.
అధికంగా జరిగిన పంట నష్టం: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా.. ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలు ముంచెత్తగా ప్రజా జీవనం అస్తవ్యస్తమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు ఇరవై మంది చనిపోగా.. పలువురు గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 8.92 లక్షల ఎకరాల పంటలు నీట మునిగినట్లు తెలిపారు. సాగుకు దాదాపు రూ.900 కోట్లపైనే నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరిగినట్లు.. వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గోదావరికి భారీ వరద రావడంతో నదికి ఇరువైపులా దాదాపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. పొలాల హద్దులు చెరిగిపోయి.. ఎవరి భూమి ఎక్కడుందో.. తెలియక రైతులు అల్లాడుతున్నారు.
పంచాయతీరాజ్‌కు తీరని నష్టం..: పంచాయతీరాజ్ శాఖకు మునుపెన్నడూ లేని రీతిలో.. అత్యంత భారీ నష్టం వాటిలినట్లు అధికారులు నివేదిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,416 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిని రూ.589 కోట్ల నష్టం జరిగింది. 837 కన్వర్టులు కూలిపోయి రూ.400 కోట్ల వరకు నష్టం జరిగింది. రోడ్లు, వంతెనలు దెబ్బతినగా దాదాపు రూ.700 వందల కోట్ల నష్టం జరిగినట్లు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై 49 వంతెనలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, జనగామ, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 509 ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు తేల్చారు. విద్యుత్ సంస్థలు రూ.21 కోట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. 400కు పైగా చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాజెక్టుల కాల్వలు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశం ఉన్నందున ఆదివారంలోగా నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: