కొనసాగుతున్న వరదలు... నిండుకుండల్లా ప్రాజెక్టులు - శ్రీశైలం జలాశయం...
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగుతుండగా... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి సామర్థ్యానికి దగ్గరవుతుండగా... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ జలాశయం...
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి నీటిమట్టానికి చేరువలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 20,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 1,008 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1088.2 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ 90.31 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 77.06 టీఎంసీలకు చేరుకుంది.
శ్రీశైలం జలాశయం...
శ్రీశైలం జలాశయానికి సైతం వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 3,98,780 క్యూసెక్కులు కాగా... అవుట్‌ఫ్లో 3,76,420 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 3,12,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుతం 883.3 అడుగులకు నీటి మట్టం చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా... 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ జలాశయం...
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాగర్‌లో ఇన్ ఫ్లో 3,25,443 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 3,25,443 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 305.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ 14 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,94,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.