"రాష్ట్రంలో ఏ ఒక్క ఆడపడుచూ బిందె పట్టుకుని రోడ్డెక్కని పరిస్థితి తీసుకొస్తాం" అంటూ... సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీ... తడారిపోతోన్న గొంతులనడిగితే తెలుస్తుందంటున్నారు మున్సిపాలిటీ వాసులు.
ఇప్పటికీ బిందెలతో పొలాల బాట...
పబ్లిక్ నల్లాలు, బోర్లు, ప్రాజెక్టుల ద్వారా తెసుకొస్తున్న నీళ్లకు తోడు.... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ... ఎన్ని రకాలుగా తాగునీటి వ్యవస్థ ఉన్నా... తమకు మాత్రం తిప్పలు తప్పటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోడ్లన్ని తవ్వి... పైప్లైన్లు వేస్తున్నారు. ట్యాంకులు కడుతున్నారు. ఇన్ని చేస్తున్నా... ఇప్పటికీ భగీరథ నీళ్లు కొన్ని పట్టణాల ప్రజల గొంతు తడపలేకపోతోంది. ఇన్ని సదుపాయాలున్నా... ఇప్పటికీ పొలాల్లోని బోర్ల దగ్గరి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.
ఇంటింటికి నల్లా రావటం కలేనా...?
ఇంటింటికి నల్లా అన్న పదం వినడానికే కానీ... ఇప్పటి వరకు చూసిందిలేదంటున్నారు కొన్ని మున్సిపాలిటీల్లోని స్థానికులు. పబ్లిక్ నల్లాలు, బోర్లు... ఎప్పుడో మూలన పడ్డాయని... వాటిని పట్టించుకునే నాథుడే లేదని మండిపడుతున్నారు. నల్లాలో ఇచ్చే నీళ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందంటున్నారు. ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటూ, ఫిల్టర్ నీళ్లు కొంటూ... గొంతు తడుపుకుంటున్న తమకు ఖర్చు తడిసి మోపెడవుతోందంటున్నారు. నీటి సమస్య ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే భయపడుతున్నారు ఓటర్లు.
తుప్పు పట్టిన తాగునీటి వ్యవస్థ...!
పట్టణాల్లో ఎన్నో ఎళ్లుగా ఉన్న తాగునీటి వ్యవస్థ తుప్పు పట్టిపోతోంది. దీర్ఘకాలికంగా ఉన్న పైప్లైన్లు పాడవటం వల్ల లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలతో తాగునీరు కలుషితమై... ప్రజలకు రోగాలు మోసుకొస్తున్నాయి. కొన్నిచోట్ల తాగునీటీ పైప్లైన్లు డ్రైనేజీ వ్యవస్థ పక్కనే ఉండటం వల్ల... పగుళ్లు ఏర్పడి మురుగునీటితో కలిసి ఇళ్లకు చేరుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. కలుషిత నీటిని సీసాల్లో నింపి అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం మాత్రం ఎండిపోయిన బావిలో నీటి ఊటలా మారిందంటూ... అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వీధుల్లో ఉన్న నల్లాలో నుంచి చుక్క ఎప్పుడొస్తుందా... అని చూసే రోజు నుంచి ఇంటికి సరిపడా నీళ్లు ఇచ్చి తమ గొంతు తడిపి కొత్త పాలకవర్గాలు పుణ్యం కట్టుకోవాలని పట్టణవాసులు వేడుకుంటున్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి... తాగు నీటి సమస్య తీర్చాలని అన్ని మున్సిపాలిటీల్లోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు