కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగటం.. అతని నోటి తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలియటం వల్ల మాస్కులు, సానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. ఎప్పుడూ సానిటైజర్లు వాడని వారు కూడా వాటి కొనుగోలు కోసం మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వారి పిల్లలకు సానిటైజర్లు, మాస్కులు కొని పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి.
255 శాతం సానిటైజర్ల కొనుగోళ్లు పెరిగినట్లు
ఒకప్పుడు సాధారణ మెడికల్ షాపులో అమ్మకానికి తెచ్చిన సానిటైజర్ స్టాకులు నెలల తరబడి నిల్వ ఉండేవి. కొద్ది మందికి సానిటైజర్లు అంటే కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు స్టాక్ వచ్చిన వెంటనే.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే 255 శాతం సానిటైజర్ల కొనుగోళ్లు పెరిగినట్లు మార్కెట్ వర్గాల విశ్లేషణ. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి.
సానిటైజర్ల అమ్మకాలు యూకేలో 260 శాతం పెరగగా.. యూఎస్‌లో 73 శాతం పెరిగాయని పీటీఐ వెల్లడించింది. సానిటైజర్లతో పాటు.. లిక్విడ్ సోప్‌లు, క్లీనర్ల అమ్మకాలు పది శాతం పెరిగాయి. ఒకప్పుడు రోజుకు పదుల సంఖ్యలో అమ్మే మాస్కులు ఇప్పుడు వందల సంఖ్యలో అమ్ముతున్నామని.. అయినా సరిపోవట్లేదని మెడికల్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
రూ.5 నుంచి రూ.50 అమ్ముతున్నారు
మరోవైపు జనాల్లో ఉన్న భయాందోళనలు, మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్లు వీటి ధరలు అమాంతం పెంచేస్తున్నారు. 50 ఎంఎల్ సానిటైజర్ రూ.60 నుంచి రూ.80కి విక్రయిస్తే.. మాస్కులను రూ.5 నుంచి రూ.50 అమ్ముతున్నారు.
ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. ఎన్ 95 మాస్కు వ్యాధిగ్రస్తులు, వారితో సన్నిహితంగా మెలిగేవారు ధరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేశారు. అధిక ధరలకు మాస్కులు అమ్ముతున్న 16 దుకాణాలను సీజ్ చేశారు.
ఇదీ చూడండి: అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు