Supreme Court on Tribal Reservations in Telangana: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. గిరిజన సంఘాలు దాఖలు చేసిన పిటషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. పలు కీలక సూచనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది.
గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో చట్ట బద్ధం కాదని, దాని వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకి విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో పలు గిరిజన సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేరిన కొట్టివేయాలని జనవరి 6న ఆధార్ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్, ఆదివాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ గిరిజన సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ఉందని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమే అని గిరిజన సంఘాలు పిటిషన్లో పేర్కొన్నాయి. చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సూచించిందన్న పిటిషనర్లు.. అందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండగా జీఓ తీసుకురావడం చట్ట ప్రకారం చెల్లదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
జీవో వల్ల రాష్ట్రంలో గిరిజనులకు నష్టం జరుగుతుందని పిటిషనర్లు తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చిన జీవో వల్ల ఉపయోగం శూన్యమని, ఎటువంటి లబ్ధి చేకూర్చని ఉత్తర్వులను కొట్టేయాలని పలు గిరిజన సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టులోనే రిట్ పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలు చేయవచ్చని సూచిస్తూ... సుప్రీం ధర్మాసనం విచారణ ముగించింది.
ఇవీ చదవండి: