ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు చేరటంపై.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేటి ఉస్మానియా ఆస్పత్రి దుస్థితికి ప్రతిపక్షాలే కారణమని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. వార్డుల్లోకి వర్షం నీరు చేరడంపై అధికారులతో మంత్రి వైద్య ఆరోగ్య శాఖ సమావేశమయ్యారు. ఉస్మానియాలో పర్యటించి పరిశీలించిన విషయాలను.. మంత్రికి నివేదిక రూపంలో అందించారు.
బేగంబజార్ నుంచి మూసీకి వెళ్లే వరద నీటి నాలా ఉస్మానియా హాస్పిటల్ భూగర్భంలోంచి వెళ్తుందని.. అది మూసుకుపోవటం వల్లే నీళ్లు వచ్చాయని అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ.. విపత్తుల నిర్వహణ బృందంతో నీటిని మొత్తం తిసివేశారని తెలిపారు. శాశ్వత పరిష్కారం కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఖులీ ఖుతుబ్షా భవనంలో 200 పడకలను సిద్ధం చేసి.. పాత బిల్డింగ్‌లోని రోగులను అక్కడికి తరలించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు బురదరాజకీయం చేయవద్దని మంత్రి ఈటల మండిపడ్డారు. కొవిడ్ బాదితులకు మెరుగైన చికిత్స అందించేందుకు.. అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
అఖిలపక్ష నేతలు...
పరిశుభ్రంగా ఉండాల్సిన ఉస్మానియా ఆస్పత్రి... బురదగుంటలా తయారైందని అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. తాము చెప్పినప్పుడే పాత భవనాన్ని కూలుస్తే ఈ సమస్య వచ్చేది కాదని.... అధికారపార్టీ కొత్త వాదనను ముందుకు తెస్తుందని తప్పుబట్టారు. చిన్న వానకే వరద రావడానికి, భవనం వయసుకు సంబంధం ఏమిటో తెలియడం లేదని ఒక ప్రకటనలో నేతలు ప్రశ్నించారు. తక్షణమే మురుగు నీటి వ్యవస్థను బాగు చేసి... శాశ్వత పరిష్కారాలు చేపట్టాలన్నారు.
ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చూస్తే బాధేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ప్రతి ఏడాది... నిర్వహణకు కేటాయించిన డబ్బులు ఎందుకు ఖర్చు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!