లాక్ డౌన్ సడలింపులపై కింది స్థాయి పోలీసులకు సమాచారం లేకపోవడం వల్ల.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాక్ డౌన్ సందర్భంగా దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఉమేష్ చంద్ర దాఖలు చేసిన పిల్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న మార్గదర్శకాలపై ఎప్పటికప్పడు కింది స్థాయి పోలీసులకు అవగాహన కల్పించడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించింది. బయటకు ఎందుకు వచ్చారో కూడా తెలుసుకోకుండా పోలీసులు ప్రజలను వేధిస్తున్నారని పేర్కొంది. తమ సిబ్బందిని కూడా విధులకు హాజరుకాకుండా అడ్డుకొని జరిమానాలు విధించారని.. పోలీసులు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించింది.
డీజీపీతో మాట్లాడి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. మార్గదర్శకాలపై సర్క్యులర్ జారీ చేయిస్తానని అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చారు. తదుపరి విచారణను ఈనెల 26కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : 'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'