వినాయక విగ్రహాలను కప్పి ఉంచేందుకు వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను ధ్వంసం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీలకు హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ తయారు చేస్తున్న వారిపై, సరఫరా చేస్తున్న వారిపై సమష్టిగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నియంత్రించే బాధ్యతను పీసీబీ, జీహెచ్ఎంసీ ఒకరిపై ఒకరు వేసుకుంటూ తప్పించుకుంటే... ప్లాస్టిక్ విస్తరించి కబళిస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
హైదరాబాద్లో పెద్ద వినాయక విగ్రహాలను కప్పి ఉంచేందుకు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తూ.. పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ వైవీ మురళీకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. వినాయక విగ్రహాలను కప్పి ఉంచేందుకు తీసుకొచ్చిన ప్లాస్టిక్ కవర్లను ఏ విధంగా ధ్వంసం చేస్తారో కార్యచరణ నివేదిక సమర్పించాలని పీసీబీ, జీహెచ్ఎంసీని ఆదేశించింది. తయారీ సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నప్పటికీ.. సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి :12వేల టెంకాయలతో నారికేళ గణనాథుడు!