ఏపీ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు ఆరోపించారు. ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని అధికారులను శిక్షించాలని పిటిషన్లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ , సాధారణ పరిపాలనశాఖ సీఎస్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్లో ఏముందంటే...
" మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కోసం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ అప్పట్లో వాదనలు వినిపిస్తూ .. నాలుగు నెలల్లో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏజీ కోర్టుకు చెప్పిన గడువులోపు కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని 2019 అక్టోబర్ 30న ఆదేశాలను జారీచేసింది. ఇప్పటి వరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇబ్బందుల్ని కమిషన్‌కు చెప్పుకోవడానికి వేలాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు".