ఈ కామర్స్ సంస్థలు నిర్మించతలపెట్టిన సరకు నిల్వ చేసే కేంద్రాలకు రాయితీలు, సత్వర అనుమతులు లభించనున్నాయి. ప్రభుత్వం ఇందుకు విధివిధానాలను ఖరారు చేసింది. సత్వర రవాణా వినియోగ వస్తువులు (ఫాస్ట్ మూవింగ్ కన్య్సూమర్ గూడ్స్), గృహోపకరణాల (డొమెస్టిక్) మార్కెట్ రంగానికి సేవా పరిశ్రమల హోదాను కల్పించాలని నిర్ణయించింది. సేవా పరిశ్రమల హోదా కింద ప్రభుత్వం వీటికి ఏకగవాక్ష అనుమతులతో పాటు దుకాణాలు, దుకాణ సముదాయాల చట్టం కింద పనివేళలు, ఉపాధి, రికార్డుల నిర్వహణలో పలు సడలింపులు ఇవ్వనుంది. ప్రభుత్వం విపత్తుల సమయంలో ఆహార, వినియోగ వస్తువులను అత్యవసర సేవల చట్టం కింద గుర్తించింది. నిల్వలపై ఆంక్షలను ఎత్తివేసి రుసుముల్లో మినహాయింపులు కూడా ఇచ్చింది. తాజాగా.. పైకప్పులపై విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వనుంది.
జిల్లాల్లోనూ నిర్మాణాలకు ప్రోత్సాహం
ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, వినియోగదారుల ప్యాకేజ్‌డ్ వస్తువుల రంగం పరిధి చాలా విస్తృతమైంది. ఐకియా, వాల్‌మార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జూబ్లియంట్ ఫుడ్స్, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థలు సత్వర రవాణా వినియోగ వస్తువులు, గృహోపకరణాల రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజా విధివిధానాల ప్రకారం ఈ సంస్థలు రూ.5 వేల కోట్లతో చేపట్టే సరకు నిల్వ చేసే కేంద్రాలు, ఇతర భవన సముదాయాల నిర్మాణాలకు ప్రభుత్వం త్వరిత గతిన అనుమతులు ఇవ్వనుంది. అలాగే ప్రత్యేక పార్కుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను గుర్తించింది. పటాన్‌చెరు, పాశమైలారంలో సూక్ష్మ మార్కెట్ల నిర్మాణాలకు అనుమతించనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, నాచారం, చర్లపల్లి, ఆటోనగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వీటి నిర్మాణాలను ప్రోత్సహించనుంది. 2 వేలు, 5 వేలు, 10 వేలు, 2 లక్షలు, 2.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దుకాణ సముదాయాలు, కేంద్రాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిర్లా టైర్ సంస్థ 50 వేల చదరపు అడుగులు, హిమాలయ హెర్బల్ హెల్త్‌కేర్ సంస్థ 36 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాముల నిర్మాణాలు చేపట్టాయి.
కరోనా సమయంలో భారీ పురోగతి
రాష్ట్రంలో ఫాస్ట్ మూవింగ్, వినియోగదారుల ప్యాకేజ్‌డ్ గూడ్స్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా కరోనా సమయంలో భారీ పురోగతి సాధించింది. ఆ సమయంలో దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు వ్యాపార లావాదేవీలు జరిగినట్లు అంచనా. వినియోగదారులు ఎక్కువగా తమ ఇళ్ల నుంచే ఆర్డర్లు ఇచ్చి సరకులను పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరల్లో పారదర్శకత, నాణ్యతతో ఈ రంగం అభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చెల్లింపులు సులభంగానే ఉంటాయి. మరోపక్క దీని ద్వారా భారీగా ఉపాధి లభిస్తోంది. విదేశీపెట్టుబడులకు అవకాశం ఉంది.
ఇదీ చూడండి: