Ministers Fires on Rahul Gandhi : ఖమ్మం వేదికగా తెలంగాణ జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ సర్కారుపై చేసిన విమర్శలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ధీటుగా సమాధానం ఇచ్చారు. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. మీదే భారత రాబందుల పార్టీ . ఏఐసీసీ అంటేనే.. అఖిల భారత కరప్షన్ కమిటీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్కాములే తాచుపాములై.. యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్రను ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు.
KTR Tweet on Rahul Gandhi : తమ పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదని కేటీఆర్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్.. బీఆర్ఎస్ అని తెలిపారు. భారత్ రాష్ట్ర సమితిని నేరుగా ఢీకొనే దమ్ములేక.. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మిస్ ఫైరింగ్‌లో కుప్పకూలేది.. కాంగ్రెస్ అని వివరించారు. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా అని ఆయన ప్రశ్నించారు. అర్థంలేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ.. హస్తం పార్టీ అని.. అందుకే కాంగ్రెస్ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందుకే దేశ ప్రజలు కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారన్నారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ఓ హోటల్లో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
Harishrao Fires on Rahul Gandhi : ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర హస్తం పార్టీదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా సైతం ఆయన స్పందించారు. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా.. తాము పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది..? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ అనంతరం.. రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఎన్నికలకు ముందే.. నువ్వానేనా అనే స్థాయిలో నేతలు విమర్శలు గుప్పించుకోనున్నారు.
ఇవీ చదవండి: