రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచించినా... ఇప్పటి వరకు కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish rao) వెల్లడించారు. ఈ ప్యాకేజి గురించి నిర్మలాసీతారామన్‌ను అడిగినా... ఆమె నుంచి స్పందన లేదని మండలికి వివరించారు. ఎమ్మెల్సీ కవిత(mlc kavitha in council), కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పారు.
విమర్శించడం సరికాదు..
యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు(cm kcr) కృతజ్ఞతలు తెలపకుండా... విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినందుకు కర్ణాటక మాజీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారని మంత్రి గుర్తు చేశారు. యాదవ సోదరులు కోరిక మేరకు గొర్రెల యూనిట్ ధరను రూ.1.20లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని డైరీ సంస్థలకు లీటరుకు రూ.నాలుగు రూపాయల లెక్కన రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీతోనే లాభం
వేతనాలు పెంచాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గతంలో అడిగితే గుర్రాలతో తొక్కించి, వాటర్ క్యాన్‌లతో కొట్టించారని విమర్శించిన మంత్రి... తమ ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ 30 శాతం పీఆర్సీ ఇచ్చిందని పేర్కొన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్(lockdown due to corona) విధించడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలో 26.11 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని... ఆరోగ్యశ్రీ కింద 87.50 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని అన్నారు. అందువల్లనే ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు వివరించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా..
ఈ ఏడాది మే18 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ద్వారా 1,18,247 మందికి చికిత్స అందించామని... ఇందుకు రూ.259.51 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ రెండూ కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించినట్లు తెలిపారు.
కేటీఆర్ వ్యాఖ్యలు
హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నామని శాసనమండలిలో మంత్రి కేటీఆర్(KTR on Urban Development) తెలిపారు. హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో రూ. 37కోట్లతో ట్యాంక్‌బండ్‌ను ఆధునీకరించినట్లు చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సర్వీస్ రోడ్లను విస్తరిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా భాగ్యనగరంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కరణ.. నగర అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి కేటీఆర్ వివరించారు.
ఇదీ చదవండి: KCR Speech in Assembly sessions 2021: కేంద్రం దగ్గరే లేవు.. ఇక తెలంగాణకు ఏమిస్తరు: కేసీఆర్