Harish Rao Reacts on Projects Are Handed Over to KRMB : రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది తప్ప పరిపాలనపై దృష్టి సారించడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు(Harish rao) ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టు అవుతుందన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు(KRMB) అప్పజెప్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు.
'ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నాం - లేదంటే చీల్చి చెండాడేవాళ్లం'
2021 జులైలో నోటిఫికేషన్ వస్తే అప్పటి నుంచి కేసీఆర్(KCR) ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏకపక్షంగా అప్పగించలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ముందు ఆపరేషన్ మ్యానువల్ ఖరారు చేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఏకపక్షంగా నోటిఫై చేశారని, అపెక్స్ కమిటీకి నివేదించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
BRS Loksabha Preparatory Meetings : వారం రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంటున్నారని, జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి ఉన్న ప్రాజెక్టులను దిల్లీకి అప్పగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఏదీ తేలకుండా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆయన, జలవిద్యుత్ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి కోల్పోతామని, సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని అన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు తాగునీటి సమస్యలు వస్తాయని, పాలమూరు - రంగారెడ్డి సహా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ప్రశ్నార్థకం అవుతాయని హరీశ్‌రావు అన్నారు.
ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తారు : హరీశ్ రావు
భవిష్యత్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ఖండిస్తారని చూశానని కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. నాడు ఏడు మండలాలు, లోయర్ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయన్న హరీశ్‌రావు ఇప్పుడు ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కోరారు.
పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీరు తీసుకుపోతే సాగర్ ఆయకట్టు, ఎడమ కాల్వకు నీరు ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కట్టినట్లు కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి తెస్తున్నా, కాంగ్రెస్ కనీసం స్పందించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది గులాబీ జెండా మాత్రమేనని మరోమారు అర్థం అవుతోందని అన్నారు.
"పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని దిల్లీకి పోయి వాటిని కేంద్రానికి అప్పగించారు. కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా చూడాలి" - హరీశ్‌రావు, మాజీమంత్రి
దావోస్‌కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్‌రావు