HarishRao Laid Foundation Stone Hospital at KPHB : హైదరాబాద్‌లో ఆనాడు ఎండకాలంలో నీరు లేక అల్లాడుతూ ఉంటే.. పీజేఆర్ ఖాళీ నీటి బిందెలతో వాటర్‌వర్క్స్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ ఈనాడు ఇంటింటికీ నీళ్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌ది అని స్పష్టం చేశారు. రాబోయే 50 సంవత్సరాల వరకు నగరానికి నీటి కష్టాలు లేకుండా ముఖ్యమంత్రి చేశారని పేర్కొన్నారు. ఈరోజు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన వివరించారు.
Harishrao on Medical Colleges : హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో వంద పడకల ఆసుపత్రికి.. మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్నాయని.. మరో 30 శాతం డెలివరీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ హయాంలో.. తొమ్మిది సంవత్సరాలలో 21 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఒక్కో మెడికల్ కాలేజీ మీద తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుందని హరీశ్‌రావు తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 13 వైద్య కళాశాలలు ఇచ్చామని.. గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.. గతేడాది 157 కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేసిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్కటీ కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆక్షేపించారు.
KCR Nutrition Kit : ఈ నెల 14న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. గర్భిణులకు ఈ కిట్‌ను రెండు సార్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. పుట్టుక నుంచి చావు దాకా ప్రజల కొరకు ఆలోచించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తున్న కేంద్ర మంత్రులు, తెలంగాణ గల్లీలలో కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే ఎర్రగడ్డలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని.. పటాన్‌చెరులో రూ.200 కోట్లతో మరో ఆసుపత్రిని నిర్మిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
"హైదరాబాద్‌లో జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నీటి కోసం ఆనాడు ధర్నాలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు. మహారాష్ట్రలో 9 రోజులకు నీళ్లు వచ్చే ప్రాంతాలు ఇప్పటికి ఉన్నాయి. హైదరాబాద్‌లో కేసీఆర్ నీటి కష్టాలు తీర్చారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి 13 కాలేజీలు ఇచ్చామని.. గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. పని చేసే వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను." - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి :