పార్టీ అంతర్గత విషయాలను చర్చించేందుకు కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ ఎంపీ వి.హనుమంత రావు రెండోసారి లేఖ రాశారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ తెరాసను ఎదర్కొవడానికి ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సవాల్‌గా తీసుకోవాల్సి ఉందన్నారు.
పేదలకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తేనే ఈ ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొని గెలవగలమని పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపి ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో గెలవగలమన్న వీహెచ్... కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వీటన్నింటిపై చర్చించాలని కోరారు.