హనుమాన్ శోభా యాత్ర రద్దు అయింది. పోలీసుల ఆడ్డంకులు, ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నిరసనగా తాము ఈ యాత్ర రద్దు చేసుకున్నామని భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ కన్వీనర్ సుభాష్ చందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో హనుమాన్ శోభా యాత్ర నిర్వహణకు తమకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
హనుమాన్ దీక్షలో ఉన్న 21 మంది మాత్రమే సాధారణంగా ఎలాంటి హంగు ఆర్భాటం, ర్యాలీ లేకుండా సికింద్రాబాద్‌లోని తాడ్బండ్ వరకు వెళ్లి దీక్ష విరమిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో హనుమాన్ ర్యాలీ నిర్వహించడం లేదని ప్రకటించారు. ర్యాలీ లేదు కాబట్టి వీడియో రికార్డింగ్ అంశంపై హైకోర్టుకు సమర్పించామని అన్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా తాము ఈ హనుమాన్ శోభాయాత్ర విరమిస్తున్నామని చెప్పారు. ఓ వర్గానికి ఓలాగా... మరో వర్గానికి మరోలాగా ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు మంచి విధానం కాదని ఆరోపించారు. హిందువులను అణిచివేసే విధంగా ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.