తెలంగాణలో వ్యవసాయ సహకార సంఘాలతో జరగాల్సిన చేనేత ఎన్నికలు కాస్త ఆలస్యంగా నిర్వహించనున్నారు. వ్యవసాయ, చేనేత ఎన్నికలు ఒకేసారి జరపడం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతో వేర్వేరుగా జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
చేనేత సంఘాలకు చివరగా 2013 ఫిబ్రవరిలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. 2014 జూన్ రెండో తేదీ తెలంగాణ ఏర్పడగా ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర చేనేత సహకార సంస్థ(ఆప్కో)ని విభజించి తెలంగాణ చేనేత సహకార సంస్థ(టెస్కో)ని ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియ పూర్తికావడంతో టెస్కో పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చేనేత సహకార సంఘాల ఎన్నికలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత సంఘాలను ప్రక్షాళన చేసింది.
మగ్గాలను నడిపే కార్మికులతో కూడిన సంఘాలనే ప్రభుత్వం గుర్తించింది. కార్మికులు లేని వాటిని మూసివేసింది. అలా రాష్ట్రంలో ప్రస్తుతం 290 సంఘాలున్నాయి. ఎన్నికల కోసం వీటిలో ఓటర్ల జాబితాను చేపట్టాలని గత ఏడాది ప్రభుత్వం ఆదేశించింది. గత డిసెంబరు 31 వరకు ఇందులో 224 సంఘాల నుంచే దాదాపు 30 వేల వరకు ఓటర్ల వివరాలు వచ్చాయి. మిగిలిన సంఘాల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి సంఘాల వారిగా అధ్యయనం అవసరం అని ప్రభుత్వం భావించింది.
తాజాగా ఫిబ్రవరి 18 వరకు వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత చేనేత సహకార ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు తేవాలని చేనేత శాఖ భావిస్తోంది. చేనేత సంఘాలకు పదవీకాలం 2018 ఫిబ్రవరి పదో తేదీతో ముగిసింది. ఆ తర్వాత సంఘాల పాలకమండళ్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి పదో తేదీతో పాలకమండళ్ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పాలక మండళ్ల పదవీకాలాన్ని పొడిగించనున్నారు.
డీసీసీబీ ఎన్నికలకు అవసరం
వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార కేంద్రబ్యాంకులు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ(డీసీఎంఎస్)ల ఎన్నికలు జరపాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్‌లు డీసీసీబీలో సభ్యులు కాగా బి కేటగిరీలో చేనేత సహకార సంఘాలకు సైతం సభ్యత్వం ఉంటుంది.
చేనేత సంఘాలకు స్థానికంగా ఎన్నికలు జరిగాయి. వాటి ఛైర్మన్లు టెస్కోకు తమ జిల్లా నుంచి ఒక్కో డైరెక్టర్‌ను ఎంచుకోవాలి. మొత్తం 33 జిల్లాల డైరెక్టర్లు కలిసి టెస్కో పాలక మండలిని ఎన్నుకుంటారు. డీసీసీబీలు, టెస్కో పాలక మండలి ఎన్నికలపై ప్రభుత్వం ఇంకా స్పష్టతకు రాలేదు. డీసీసీబీలకు రద్దు చేసి, ప్రాథమిక సహకార సంఘాల నుంచి నేరుగా జిల్లాకో డైరెక్టర్‌ను ఎన్నుకొని, వారి ద్వారా రాష్ట్ర సహకార బ్యాంకులో పాలకమండలిని ఎంపిక చేయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.