టీఎస్పీఎస్సీ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురుకుల పీఈటీ అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు పీఈటీ అభ్యర్థులను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంపికైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని పీఈటీ అభ్యర్థులు ఆరోపించారు. గత ఐదేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని అభ్యర్థులు వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తమ సమస్యలను పరిష్కరించమని శాంతి యుతంగా అసెంబ్లీకి వచ్చిన తమను... పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోలీసు స్టేషన్లో ఆందోళనకు దిగారు. 2017 సెప్టెంబర్లో పీఈటీ పరీక్షలు రాసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదని వాపోయారు. టీఎస్‌పీఎస్సీ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టి... హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను ప్రకటించాలని కోరారు. చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని పేర్కొన్నారు. 616 పోస్టులకుగాను 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారని తెలిపారు. రోజు రోజుకు కుటుంబ పోషణ భారం అవుతోందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు ఉద్యోగులు ఇవ్వాలని వేడుకున్నారు.
"పక్షం రోజుల్లో నియామకాలు చేపట్టాలని మార్చి 8న నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తీర్పునిచ్చారు. ఏడు నెలలైనా ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదంటే.. తమ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. హైకోర్టు తీర్పును కూడా టీఎస్పీఎస్సీ లెక్కచేయట్లేదు. పాఠశాలలు కూడా ప్రారంభమయ్యాయి. మాకు మాత్రం పోస్టింగులు ఇవ్వలేదు. హైకోర్టు తీర్పు ప్రకారం వెంటనే టీఎస్పీఎస్సీ గురుకుల పీఈటీ నియామకాలు చేపట్టాలి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి.. వారం రోజుల్లో నియమకాలు చేపట్టాలి. మేము మా భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నాం. కేసీఆర్ సార్ మీరే మా సమస్యను పరిష్కరించాలి "- పీఈటీ అభ్యర్థులు
ఇదీ చదవండి: Warangal rape case: అత్యాచారం కేసు.. తెరాస కార్పొరేటర్ భర్త అరెస్టు