రాష్ట్రంలో గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి కసరత్తు మొదలైంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం గురుకులాల్లో సర్వీసు నిబంధనలను బోర్డు సిద్ధం చేయగా వాటిని ప్రభుత్వం ఆమోదించింది. బీసీ గురుకుల సొసైటీల్లో 135 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మిగతా సొసైటీల్లో ఉపాధ్యాయేతర బ్యాక్లాగ్ పోస్టులకు కలిపి ప్రకటన ఇవ్వనుంది. ఇప్పటికే సొసైటీల నుంచి ప్రతిపాదనలు గురుకుల బోర్డుకు చేరుకున్నాయి.
మిగిలిన ఉద్యోగాలకు ప్రతిపాదనలు
టీజీటీ, స్టాఫ్‌నర్సు, లైబ్రేరియన్ తదితర ఉద్యోగాలకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో సొసైటీలు ఉన్నాయి. ఇందుకు తగిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ఈ నెలాఖరులోగా బోర్డుకు చేరేలా చేస్తున్నారు. ఒక్క బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే దాదాపు 6 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ప్రతిపాదనల ప్రక్రియ పూర్తైతే వచ్చే నెలలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి భర్తీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి : చంద్రయాన్-2: తెలుసుకోవాల్సిన విషయాలు