రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ప్రారంభానికి సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 15 నుంచి పాఠశాలల ప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాల జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈలోగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలుత 9, 10, ఇంటర్ విద్యార్థులకు తరగతుల ప్రారంభానికి ప్రాధాన్యమివ్వనున్నాయి. గురుకులానికి వచ్చిన ప్రతి విద్యార్థిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. అప్పటికి ఎలాంటి లక్షణాలు లేకుంటే తరగతులకు పంపిస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఇప్పటికే ‘పనేసియా’పేరిట హెల్త్ కమాండ్ సెంటర్ ఉంది.
ఇవీ చర్యలు: తరగతిగదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుగా.. అందరినీ ఒకేసారి కాకుండా తొలుత ఒక తరగతిలో సగం మంది విద్యార్థులనే పిలుస్తారు. ఆ తరువాత మరికొందరిని రప్పిస్తారు. విద్యార్థులందరికీ క్వారంటైన్ పూర్తయ్యే వరకు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలు పూర్తికాలేదు. నవంబరు 1న పరీక్ష జరిగినా ప్రవేశాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐదో తరగతిని మినహాయించి మిగతా విద్యార్థులకు సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగించాలని భావిస్తున్నారు.
విద్యార్థులకు ప్రత్యేక మెనూ..
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక మెనూ ఉండాలని గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. సందేహాల నివృత్తి కోసం వస్తున్న పలువురు విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాఠశాలల్లోని విద్యార్థులకు అధిక పోషకాలు, వైరస్‌ను నిరోధించే ఆహారాన్ని అందించాలని సొసైటీలు నిర్ణయించాయి.
ఇదీ చదవండిః ఫీజుల చెల్లింపుపై 10 లక్షల మంది తల్లిదండ్రుల వెనకడుగు