తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. ఏపీ విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గులాబ్ తుపాను దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని కుదించారు. మరికొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
తీరప్రాంతం అప్రమత్తం..
గులాబ్ తుపాను ముంచుకొస్తున్న తరుణంలో.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది. గార, కవిటిలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా పరిధిలో తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో.. కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు, మెరైన్, విద్యుత్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను పరిస్థితులను బట్టి ఆపదలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం
ఈ తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని 27 గ్రామాల్లో మత్స్యకారులు.. అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బారువ, పొగరు వద్ద సుమారు 100 బోట్లను లంగరు వేసి ఉంచుకున్నామని.. మహేంద్రతనయ నుంచి భారీగా వరద వస్తే.. ఆ బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన వలలు, బోట్లు పాడవకుండా అధికారులు ముందస్తు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తమ గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Gulab Cyclone in Telangana : తెలంగాణలోనూ 'గులాబ్' గుబులు.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు!