అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస రైతన్నలకిచ్చిన హామీకనుగుణంగా రుణమాఫీ అమలుకు సర్కారు చర్యలు చేపట్టింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబరు 11 మధ్య కాలంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఈ రుణమాఫీ వర్తించనుంది. ప్రత్యేక రాష్ట్రావిర్భావం అనంతరం.... 2014 మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలను అప్పట్లో ప్రభుత్వం మాఫీ చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రుణాలు తీసుకున్న రైతులకే తాజాగా మాఫీ చేయాలని నిర్ణయించింది.
నిబంధనలివి...
⦁ రైతు కుటుంబంలో ఎందరికీ ఎంత భూమి ఉన్నా... ఎన్ని పంట రుణాలు తీసుకున్నా... కుటుంసభ్యులందరికీ కలిపి లక్ష రుణ మాఫీ చేయాలని నిర్ణయించింది.
⦁ 18 నెలల్లోగా చెల్లించే గడువు ఉన్న పంట రుణాలతో పాటు... పాత రుణాన్ని రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తించనుంది.
⦁ గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో పంట రుణం పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వారికే మాఫీ వర్తించనుంది.
⦁ పంట ఉత్పత్తులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు, సంయుక్త పూచీకత్తు సంఘం లేదా రైతు మిత్ర బృందాలు, రుణ అర్హత కార్డు పేరుతో తీసుకున్న రుణాలకు, రీషెడ్యూల్ చేసిన వాటికి ఈ మాఫీ వర్తించదు.
అర్హుల వివరాలతో ప్రత్యేక పోర్టల్
⦁ రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా వ్యవసాయశాఖ కమిషనర్ ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన వారి వివరాలన్నీ అందులో నమోదు చేస్తారు.
⦁ ఒక రైతు అన్ని బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలు, బంగారం రుణాలన్నీ పోల్చి చూసి అర్హులైన జాబితాను కలెక్టర్‌కు పంపాల్సి ఉంటుంది.
⦁ కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి జాబితాను పోల్చి చూసేందుకు మండల స్థాయిలో అన్ని బ్యాంకుల అధికారుల సమావేశం నిర్వహిస్తారు. దీనిని తహసీల్దార్ పరిశీలించి, బోగస్ ఉంటే గుర్తిస్తారు.
⦁ సహకార శాఖ ఆడిటర్లు జిల్లాల వారీగా అర్హుల జాబితాలును తనిఖీ చేసి సమగ్ర జాబితాలను వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపుతారు.
⦁ తుది జాబితాను మండలంలో అన్ని బ్యాంకులకు పంపించి రైతు కుటుంబంలో సభ్యులందరికీ ఉన్న బకాయిలు లక్ష లోపు ఉంటే అన్నీ మాఫీ చేస్తారు.
⦁ 25 వేల రూపాయల లోపు బాకీ ఉన్న రైతులందరికీ తొలిదశలోనే మాఫీ కానున్నందున వారికి ఒకేసారి చెక్కులు అందజేస్తారు.
⦁ 25 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు బాకీ ఉన్న రైతులకు... 4 వాయిదాల్లో చెక్కులు ఇస్తారు.
⦁ తుది జాబితాలను గ్రామాలకు తీసుకెళ్లి అందులో ఉన్న పేర్ల ప్రకారం రైతులకు చెక్‌లు అందజేసి రైతు నుంచి సంతకాలు తీసుకుంటారు.
⦁ చెక్ రూపంలో ఇచ్చిన సొమ్ము పంట రుణ ఖాతాకే చెల్లిస్తానని రైతు నుంచి రాతపూర్వకపత్రం వ్యవసాయాధికారి తీసుకోవాల్సి ఉంటుంది.
⦁ పథకం అమలు తర్వాత సహకార శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల లెక్కలు ఆడిట్ చేస్తాయి.
అర్హుల జాబితాలు తయారు చేసి ఇచ్చే బ్యాంకులు వాటిలో తప్పులు రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బ్యాంకు మేనేజర్ సంతకంతో అర్హుల జాబితాను తీసుకోవాలి. మాఫీ అమలులో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తారు. రైతుల నుంచి ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా వాటిని ఈ విభాగాలు పరిష్కరిస్తాయి.
ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం