భవన నిర్మాణ కార్మికులు పడుతున్న సమస్యలపై అఖిలపక్షం నేతలు కార్మిక శాఖ అధికారులను కలిశారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని... గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను, నెరవేర్చాలని అశోక్‌నగర్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కమిషనర్‌కు నేతలు మెమోరాండం ఇచ్చారు.
చావొద్దని చెప్పిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికులు 15 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఎవరూ ఆకలితో చావొద్దని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ కార్మికులకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ. 1500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా సహాయం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.
కార్మికుల శ్రేయస్సు కొరకు పని చేయాలి
కార్మికుల శ్రేయస్సు కోసం సంక్షేమ బోర్డు పని చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికులను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. నెలకు రూ. 5 వేల చొప్పున 15 లక్షల కార్మికులకు రెండు నెలల డబ్బులు వెంటనే ఇవ్వాలిని కోరారు.
నెలకు రూ. 5 వేలు ఇవ్వాలి
భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని గతంలో సీఎం కేసీఆర్‌కు చెప్పామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రూ. 1500 ఇస్తా అని, ఇవ్వలేదని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోకపోవడం చాలా అన్యాయమన్నారు.
ఇదీ చూడండి : ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు.. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్