TSPSC Eligibility Test: టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు పేపర్‌ను అర్హత పరీక్షగా ప్రవేశపెట్టాలని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ పలువురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను కలిసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. దీంతో సెక్రటరీ అనిత రామచంద్రన్‌కు తమ వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మాత్రమే అర్హత పరీక్షగా నిర్వహిస్తున్నారని.. ఫలితంగా తెలుగు భాషలో విద్యను అభ్యసించిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వారు సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు.

వివిధ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సహా యూపీఎస్సీలోనూ ఇంగ్లీష్‌తో పాటు వారి ప్రాంతీయ భాషలను అర్హత పరీక్షలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్స్ పరీక్షలోనూ ఆంగ్లంతో పాటు తెలుగును అర్హత పరీక్షగా నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకువచ్చారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలోనూ తెలుగు పేపర్‌ను కూడా అర్హత పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్పీఎస్సీ కోరినట్లు వారు తెలిపారు.

రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రకటించిన ప్రాథమిక కీపై.. వచ్చిన అభ్యంతరాలు, సబ్జెక్టు నిపుణుల సిఫార్సు మేరకు 5ప్రశ్నలను కమిషన్ తొలగించింది. మొత్తం 150 ప్రశ్నల్లో అయిదింటిని తొలగించినందున.. 145 ప్రశ్నలను 150కి దామాషా పద్ధతిలో లెక్కించి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. 503 పోస్టులకోసం.. మెయిన్స్‌కి 25050 మంది ఎంపికయ్యారు. మల్టీజోన్, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున.. 25,050 మందిని ఎంపికచేశారు.

జూన్ 5 నుంచి 12 వరకు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదివరకే ప్రకటించింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, 6న పేపర్-1 జనరల్ ఎస్సే, 7న పేపర్-2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ,.. 8న పేపర్-3 భారత సమాజం, రాజ్యాంగం, పాలన, .. 9న ఎకానమీ, డెవలప్‌మెంట్, 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా సైన్స్,... 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావిర్భావం పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగున్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూల్లో ప్రధాన పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష పూర్తిగా ఒకే భాషలో రాయాలని కమిషన్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం
'LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు.. వారి కోసం త్వరలోనే వస్తారు!'