ground water raise in Telangana : తెలంగాణలో 2020తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలాల రీఛార్జి 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21.11 శతకోటి ఘనపుమీటర్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా-2022’ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూగర్భజలాల్లో 19.25 శతకోటి ఘనపు మీటర్ల నీటిని తోడుకోవడానికి వీలున్నప్పటికీ ప్రస్తుతం 8 శతకోటి ఘనపు మీటర్లు (41.6%) మాత్రమే వాడుకుంటున్నట్లు తెలిపింది. 2020 నాటి లెక్కలతో పోలిస్తే భూగర్భ జల రీఛార్జి 4.48 శతకోటిఘనపు మీటర్ల మేర పెరిగినట్లు వెల్లడించింది. మొత్తంగా భూగర్భజలాల వాడకం 53.32% నుంచి 41.6%కి తగ్గిపోయినట్లు పేర్కొంది.
Telangana ground water : ఇందుకు ప్రధాన కారణం మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ పనులు, సాగునీటి అవసరాల కోసం ఉపరితల జలాల లభ్యత పెరగడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయడమేనని ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 594 మండలాల్లోని భూగర్భజలవనరులపై అంచనా వేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా నీటిని తోడేస్తున్నారని పేర్కొంది. ఇక్కడ వాడుకోవడానికి అందుబాటులో ఉన్న నీటిలో 95%కి పైగా తోడేసుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని 16 మండలాల్లో 4 సేఫ్, 4 సెమీ క్రిటికల్, 8 ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఎక్కడా లవణీకరణ ప్రభావం లేదని వివరించింది.
అత్యధిక భూగర్భజలాలు వాడుకొనే జిల్లాలు: హైదరాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల
అత్యల్పంగా వాడుకొనేవి: కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, మంచిర్యాల రీఛార్జి కంటే ఎక్కువ తోడుతున్న మండలాలు(13): ఆదిలాబాద్ అర్బన్, చార్మినార్, బహదూర్‌పుర, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్, సైదాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బాలానగర్, కుత్బుల్లాపూర్, నిజామాబాద్‌సౌత్, హయత్‌నగర్.
క్రిటికల్ జాబితాలోని మండలాలు: చుంచుపల్లి, దమ్మపేట, వెల్దండ, రుద్రూరు, ఆర్మూరు, శేరిలింగంపల్లి, దుబ్బాక. ఇవి కాక 80 మండలాలు సెమీ క్రిటికల్, 494 మండలాలు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి.