కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం స్ఫూర్తి వెల్లివిరిసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో హరిత శుక్రవారం నిర్విహంచి... మొక్కలకు నీటి సౌకర్యం కల్పించాలన్న సీఎంఓ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజలు రంగంలో దిగారు. ట్యాంకర్లతో నీటిని తరలించి మొక్కలకు సరఫరా చేశారు.
వేసవి తీవ్రత ఉన్నప్పటికీ కార్యక్రమం కొనసాగింది. జిల్లాల వారీగా సాగిన కార్యక్రమ తీరును సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షించారు. అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూనే వీలైనంత మంది పాల్గొని ఎక్కువ మొక్కలకు నీరు అందేలా ప్రతీ శుక్రవారం కార్యక్రమం కొనసాగాలని ప్రియాంక వర్గీస్ సూచించారు.
నీటి సరఫరా జరిగేలా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు సమన్వయం చేసుకోవాలని... ఎండల తీవ్రత పెరిగినందున గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై కూడా దృష్టి సారించాలని కోరారు. ఆకుపచ్చని జాలీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షించాలని... వచ్చే సీజన్ కోసం వీలైనంత పెద్ద మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రియాంక వర్గీస్ సూచించారు.