కర్షకులకు కాసుల వర్షం
బహుళ పోషకాల గని.. ద్రాక్ష పండు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కర్షకులకు కాసుల వర్షం కురిపించిన ద్రాక్ష.. కనుమరుగైపోతున్న నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
నూతన ఒరవడికి శ్రీకారం
రాష్ట్రంలో ద్రాక్ష పంట సాగు కోసం రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహించడం, సస్య రక్షణ యాజమాన్యాలు చర్యలు, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన సహా హైదరాబాద్ జంట నగరవాసులకు రుచులు చూపించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
మహానగరంలో "గ్రేప్ ఫెస్టివల్" షురూ..
ఈ రోజు నుంచి వారం రోజులపాటు జరగనున్న "గ్రేప్ ఫెస్టివల్"కు రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన కేంద్రం వేదిక కానుంది. వారంతం దృష్టిలో పెట్టుకుని ద్రాక్ష పండుగ కోసం శాస్త్రవేత్తలు రంగం సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆసక్తిగల రైతులను రప్పించి పంట క్షేత్రాన్ని చూపించాలని శాస్త్రవేత్తలకు సూచించారు.
అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
తెలంగాణ ప్రజల ఆహారపు అలవాట్లపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ద్రాక్ష తీసుకుంటే 3.52 లక్షల మంది రాష్ట్ర ప్రజలు సగటున 160 గ్రాములు తింటున్నట్లు తేలింది. సంవత్సరానికి ప్రతి మనిషి 2 కిలోలు వినియోగిస్తుండగా.. ఆ లెక్కన నెలకు 217 మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకపై ఆధారపడకుండా తెలంగాణలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రోత్సహించి పండిస్తే ఆ సొమ్ము రైతులకే చేరుతుందని కమిషనర్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 25 రోజుల్లో పల్లెల రూపురేఖలు మారాలి : సీఎం కేసీఆర్