దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. జీఎం గజానన్ మాల్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రైల్వే అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓబులవారి పల్లె-వెంకటాచలం స్టేషన్లను కలుపుతూ 93 కి.మీల విద్యుదీకరణతో సహా నూతన రైలు మార్గాన్ని ప్రారంభించామని తెలిపారు.
దీనిలో భాగంగా నిర్మించిన 6.6 కి.మీల సొరంగ మార్గం భారతీయ రైల్వేలోనే అతి పొడవైన విద్యుదీకరించిన సొరంగ మార్గంగా ఆయన అభివర్ణించారు. 2019 ఏప్రిల్ -జూలై మధ్య 12 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా 774 ప్రత్యేక రైళ్లను 4483 అదనపు కోచ్‌లతో నడిపించామని జీఎం పేర్కొన్నారు. రైల్వే పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దమ.రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య జెండా ఆవిష్కరించారు. అనంతరం లాలాగూడలోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్ని సందర్శించి రోగులకు భోజనం, బిస్కట్లు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి : 'నీటి సంరక్షణ కోసం ప్రజలు, ప్రభుత్వాలు ముందుకు రావాలి'