రాష్ట్రంలో వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఈసారి యాసంగి పంట కొనుగోలు కొరకు 6,575 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలిపామని.. డిమాండ్‌ను బట్టి కేంద్రాల సంఖ్య పెంచనున్నట్లు పేర్కొన్నారు. కోటికి పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈసారి కొనుగోలు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎఫ్సీఏ సైతం ఈసారి 50శాతం సన్నాలను మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన విధించిందని.. సీఎం కేసీఆర్ చొరవతో 15 నుంచి 20 శాతం మాత్రమే తీసుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లో సన్నాలకే ఎక్కువగా డిమాండ్ ఉందని... దిగుబడి, డిమాండ్ ఉన్న పంటల వైపే రైతులు మళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్ సేవలు!