రాష్ట్రంలోని రెండు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు, ఇతరులు ఎన్నికలను పూర్తి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంత్రులు, ఆయా పార్టీల అధ్యక్షులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. పార్టీలు, అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఊరూ వాడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర ఎన్నికల తరహాలో ఈ ఎన్నికలకు వ్యయపరిమితి లేకపోవడం రాజకీయపార్టీలు, అభ్యర్థులకు సులువైంది. ఎలాంటి లెక్కలు, పరిమితులు లేకపోవడం వల్ల స్వేచ్చగా ఖర్చు చేస్తున్నారు.
ముగియనున్న ప్రచారం
కొన్ని నెలలుగా సాగుతున్న ఎన్నికల హడావుడి... నోటిఫికేషన్ వచ్చిన గత నెల 16వ తేదీ నుంచి ఉద్ధృతమైంది. దాదాపుగా నెల రోజుల నుంచి ప్రచారం హోరెత్తుతుండగా... నేటితో ముగియనుంది. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే ఇవాళ సాయంత్రం వరకు ప్రచారం ముగియనుంది. ప్రచారం పూర్తైతే ఇక అసలైన రాజకీయం ప్రారంభం కానుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయపార్టీలు, అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాయి. ఇప్పటికే ఓటర్లను కొనుగోలు చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నగదు, మొబైల్ ఫోన్లు, ఇతరత్రాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా అన్ని రకాల అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జంబో బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పెద్దసంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు. దీంతో దినపత్రిక పరిమాణంలోని బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తైంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ముద్రణాలయంలో... నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలను మహారాష్ట్రలో ముద్రించారు. బ్యాలెట్ పత్రాలన్నీ ఇప్పటికే ఆయా రిటర్నింగ్ అధికారుల వద్దకు చేరాయి. ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. డీజీపీ, పోలీసు అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్న సీఈఓ... ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారు.
మూతపడనున్న వైన్సులు, బార్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు.... ఓట్ల లెక్కింపు రోజైన 17వ తేదీ నాడు... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వీటిని మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ల పరిధిలో స్టార్ హోటళ్లలో బార్లు, రిజిస్టర్ అయిన క్లబ్బులు కూడా మూసేయాలని కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావారణంలో... ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పట్టభద్రుల స్థానానికి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదీ చదవండి: గడువు దగ్గరపడుతున్నకొద్దీ జోరుగా ఎమ్మెల్సీ ప్రచారం