రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పశువైద్యాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో టీకా మందులు అందుబాటులో ఉన్నాయని పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి అన్నారు. అత్యవసర సేవలకు టోల్‌ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశామన్నారు. సంచారం వైద్యశాలలను రైతులు వినియోగించుకోవాలన్నారు.
గ్రామాల పరిధిలో పశువైద్యాధికారులు సకాలంలో స్పందిచాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాల్లో 60 గేదేలు, 246 గొర్రెలు, 35 మేకలు, 10,700 కోళ్లు మృత్యువాతపడ్డాయని వెల్లడించారు. త్వరలోనే అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పశుసంవర్ధకశాఖ సంచాలకులు పేర్కొన్నారు.