రూ.25 వేల కోట్లు అంచనా
ఒకే విడతలో రుణమాఫీ సాధ్యం కాదని పలుమార్లు స్పష్టం చేసిన కేసీఆర్... ఈ సారి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీకి రుణాలను మాఫీ చేయడానికి రూ.25 వేల కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దశల్లో రుణమాఫీని అమలు చేశారు. రైతుల నుంచి కొందరు బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొద్దిపాటి రుణం ఉన్నవారు కూడా నాలుగేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపాదనలు
రూ.50 వేల వరకు ఉన్న రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా కొద్ది పాటి మొత్తం రుణం ఉన్న రైతులకు తక్షణమే పూర్తి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకర్ల ఖాతాలోకి నగదు జమచేయకుండా రైతుబంధు తరహాలో చెక్కులు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.