రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత బాధ్యతగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్ భవన్ నుంచి ఆమె కాళోజీ నారాయణ రావు వర్సిటీ అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కరోనా నివారణలో భాగంగా.. మెడికల్ కాలేజీలు తమ పరిధిలో ప్రజలకు చేరువై పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని గవర్నర్ సూచించారు. కొవిడ్‌పై పోరాటంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విశేషమైన కృషి చేస్తున్నారని.. వారిని బాగా చూసుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. వైద్య సిబ్బంది మానసిక స్థయిర్యాన్ని పెంపొందించాలన్నారు.
నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 4,790 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ సీట్ల సంఖ్యను పెంచడానికి తగిన అనుమతుల కోసం కృషి చేయాలన్నారు. కొవిడ్ వంటి వైరల్ సమస్యలపై మరింత విస్తృత పరిశోధనలను ప్రోత్సహించి.. ఆ డేటాబేస్ తయారు చేసుకొని అందరికీ అందుబాటులోకి తేవాలని గవర్నర్ సూచించారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్స్లర్ కరుణాకర్ రెడ్డి, రిజిస్ట్రార్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, సంయుక్త కార్యదర్శులు భవానీ శంకర్, సిఎన్ రఘు ప్రసాద్, అనుసందాన అధికారి సీహెచ్ సీతారాములు, డా.రాజారాం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!