చిన్నవయసు నుంచే పిల్లలకు.. తల్లిదండ్రులు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లో పుస్తక పఠనాభిరుచిని పెంచాలని గవర్నర్ తెలిపారు. పుస్తక పఠనం శక్తివంతులను చేస్తుందని వివరించారు. పుస్తకం చదవనిది రోజు గడవదని పేర్కొన్నారు. తానిక్కడకు పుస్తక అభిరుచి ఉన్న వ్యక్తిగా వచ్చినట్లు తమిళిపై స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత పరిస్థితులు కార్మికులు కర్షకులు కష్టాలు మన సంస్కృతి విశిష్టత వంటి రచనలపై కవులు రచయితలు దృష్టి పెట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈరోజు నుంచి జనవరి 1 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో 330 బుక్ స్టాళ్లు కొలువుదీరాయి. రోజూ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు.. సెలవు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు పుస్తక ప్రదర్శన తెరిచి ఉంటుందని.. పిల్లలకు ప్రవేశం ఉచితమని.. నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'పుర' పోరుకు షెడ్యూల్ విడుదల... జనవరి 22న ఎన్నిక