Governor Tamilisai: ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో దేవదాసిగా నటించిన సాయిపల్లవిని కొందరు బాడీ షేమింగ్ చేయడంపై తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పందించారు. ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడటం నన్ను తీవ్రంగా కలచివేసింది. పొట్టిగా ఉంది, నల్లగా ఉందంటూ మహిళలను పలువురు కించపరుస్తూ ఉంటారు. ఆ వ్యాఖ్యలు సంబంధితుల మనసును గాయపరుస్తాయని ఆలోచించరు. నేనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను. నన్ను ‘పరట్టై’ (చింపిరి జుత్తు) అని సంబోధించేవారు. కఠినమైన కృషి, ప్రతిభతో వాటిని దాటుకుని ధైర్యంగా ఎదిగాను. ఏదైనా అందమే. అందుకే కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత ఉంది. సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్‌కు గురవుతున్నార’ని పేర్కొన్నారు.
ఓ సంఘటనను ఉదహరిస్తూ... సుమారు 50 ఏళ్ల మహిళను వృద్ధురాలు అంటూ సంబోధించారని, అదే ఆ వయసు మగవారిని యువకుల్లా చూస్తుంటారని తెలిపారు. ‘ఈ సమాజం మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి యత్నిస్తోంది. బాడీ షేమింగ్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా, మానసికంగా దృఢంగా, ధైర్యంగా ఉండాల’ని మహిళలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: