Governor Tamilisai on Telangana Liberation Day: స్వాతంత్య్ర సమరయోధులను.. వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడిన హైదరాబాద్ వాసులు.. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందడంతో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ విమోచన అమృత్ మహోత్సవాల ప్రారంభ వేడుకులకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్‌లో నిజాం పరిపాలనలో తెలంగాణ ఎదుర్కొన్న బాధలు.. స్వాతంత్య్ర సమరయోధుల కృషి కనిపిస్తుందని వివరించారు. అనంతరం విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గవర్నర్ సత్కరించారు. ఈ క్రమంలోనే వరంగల్ పరకాలలో ఆనాడు 35 మందిని వరుసలో నిలబెట్టి.. నిజాం రాజులు తుపాకీతో కాల్చి చంపడం అమానుషమని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.
నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వరంగల్ పరకాలలో 35 మందిని వరుసలో నిలబెట్టి నిజాం రాజులు తుపాకీతో కాల్చి చంపారు. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందడంతో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను అంతా గుర్తుపెట్టుకోవాలి: తమిళి సై సౌందరరాజన్, గవర్నర్
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా.. ఇదిలా ఉండగా.. అప్పటి హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తై.. 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రారంభ వేడుకలను నిర్వహించనుంది. ఇందుకోసం సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఇందుకోసం పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయా జిల్లాల్లో పతాకావిష్కరణ చేసే మంత్రులు, ప్రముఖుల పేర్లను ఇప్పటికే జీఏడీ ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 16వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ర్యాలీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువత, మహిళా సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
ఇవీ చూడండి..
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ
పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు