Governor tamilisai in JNTU convocation : జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. సమస్యలను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అదే విధంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95మందికి బంగారు పతకాలను అందజేశారు.
ఒత్తిడి పెరుగుతోంది..
యువతలో ఒత్తిడి పెరుగుతోందని... విద్యార్థి దశ నుంచే ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. చిన్న సమస్యలను కూడా తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మరువకూడదని అన్నారు. పట్టాలు అందుకుంటున్న వారంతా ఉద్యోగాల కోసం వెతుక్కునే వారు కాకుండా... ఉద్యోగాలు కల్పించే వారిగా మారాలని సూచించారు.
'బంగారు పథకాలు సాధించిన వారికి, సాధించని వారికి శుభాకాంక్షలు. యువతలో డిప్రెషన్ పెరిగిపోతోంది. చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేక పోతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలి. ఎప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మరువకూడదు. పట్టాలు పొందిన వారంతా... ఉద్యోగాలు వెతుక్కునే వారిలా కాదు.. కల్పించేలాగా మారాలి.'
-తమిళిసై, గవర్నర్
ఇదీ చదవండి: 'కష్టాల నుంచి ఆలోచన.. తాళిని తాకట్టుపెట్టి టీకప్పులు తయారీ'