గిరిజనుల ఆదాయం వృద్ధి చెందేందుకు విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన, ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఎన్ఐఎన్, ఈఎస్ఐ అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులతో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమె చర్చించారు. ఆదిలాబాద్‌లోని కొల్లం, భద్రాద్రి కొత్తగూడెంలోని కొండరెడ్లు, నాగర్‌కర్నూల్‌లోని చెంచు తెగల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో యూనివర్సిటీలను భాగస్వామ్యం చేశారు.
వారి భూముల్లోనే కూలీలుగా..
ఆదిమ జాతి గిరిజనులకు వ్యవసాయ భూములు, పశువులు, ఇతర వనరులు ఉన్నప్పటికీ.. వారి భూముల్లోనే వారు కూలీలుగా పని చేస్తున్నారని రాజ్‌భవన్ నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లు గవర్నర్ తమిళిసై వెల్లడించారు. గిరిజనులకు అవసరమైన శిక్షణ ఇచ్చి, వనరులను సమకూర్చాలని ఆమె సూచించారు. వారు సొంతంగా వ్యవసాయం, పశుపోషణ, పాడి అభివద్ధి చేసుకునేలా తీర్చిదిద్దాలని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల వీసీలకు గవర్నర్ సూచించారు.
వైద్యసాయం అందించాలి
గిరిజనుల ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిశీలించి.. అవసరమైన వైద్యసాయం అందించే బాధ్యతను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఈఎస్ఐ వైద్య కళాశాల తీసుకోవాలని ఆమె కోరారు. ఆరోగ్యం, ఆదాయం పెరిగితే గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారన్నారు. నిర్దిష్ట కాల పరిమితితో కార్యక్రమాలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
సృజనాత్మకతను ప్రోత్సహించాలి: గవర్నర్
విశ్వవిద్యాలయాల్లో విద్య, పరిశోధన, సృజనాత్మకతలను ప్రోత్సహించేందుకు ఛాన్స్లర్ అవార్డులు ఇవ్వాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. అవార్డుల కోసం అవసరమైన విధివిధానాలను ఉన్నత విద్యా మండలి సమన్వయంతో త్వరలో ఖరారు చేయనున్నారు. ఉత్తమ టీచర్, ఉత్తమ పరిశోధన, విద్య సామాజిక బాధ్యతల్లో ఉత్తమ యూనివర్సిటీ కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. అవార్డుల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు కానుంది. రాజ్ భవన్లో ఇవాళ ఉన్నత విద్యా మండలి ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. ఛాన్స్లర్ అవార్డులు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా.. అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా విధివిధానాలు రూపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. విధివిధానాలు నిర్ణయించాకే అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. సమాజానికి ముఖ్యంగా స్థానికులకు ఉపయోగపడే పరిశోధనలు చేసిన వారికి గుర్తింపు ఉండాలని తమిళిసై పేర్కొన్నారు.
అవార్డు గ్రహితలకు గ్రాంట్లు: పాపిరెడ్డి
అవార్డు గ్రహీతలకు ఉన్నత విద్యా మండలి ఆర్థిక గ్రాంట్లు అందిస్తుందని ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకట రమణ, వీసీలు ప్రవీణ్ రావు, కరుణాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత, ఈఎస్ఐ డీన్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మదన్ మోహన్ రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.