సెయిలింగ్ చాలా క్లిష్టమైన క్రీడ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో జాతీయ 35వ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ప్రారంభించారు. ఈ నెల 19వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. గాలి వేగాన్ని తట్టుకొని ముందుకు సాగడం గొప్ప విషయమని గవర్నర్ కొనియాడారు. ఆ వేగాన్ని ఆశావహులు తమకు అనుకూలంగా మలచుకుని ఎదురీదుతూ... ముందుకు సాగుతారని తమిళిసై పేర్కొన్నారు. ఈ పోటీల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోటీల్లో పాల్గొనే సెయిలర్లతో ఫొటోలు దిగిన అనంతరం గవర్నర్.. హుస్సేన్ సాగర్‌లో కాసేపు బోటింగ్ చేశారు.
జాతీయ స్థాయి పోటీలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సెయిలర్లను గవర్నర్ అభినందించారు. హుస్సేన్‌సాగర్ లేక్‌ను శుభ్రం చేసి జంట నగరాల ప్రజలకు అవగాహన కల్పించారని కొనియాడారు. భవిష్యత్తులో మంచి శిక్షణ ఇచ్చి దేశానికి పతకాలు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఒలింపిక్స్ సెయిలింగ్ విభాగంలో పతకం సాధించిన నేత్ర కుమరన్, విష్ణు శరవణన్‌ను గవర్నర్ తమిళిసై సత్కరించారు.
సెయిలింగ్ సవాలుతో కూడుకున్న ఆట. ఈ పోటీల్లో గెలిచిన వాళ్లే జీవితంలో కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు. నిరాశావహులు సెయిలింగ్‌లో దిశను మార్చుకుంటే.. ఆశావహులు మాత్రం.. గాలికి ఎదురీదుతారు. అలాంటి వారినే విజయం వరిస్తుంది. -తమిళిసై, గవర్నర్.
ఈ కార్యక్రమంలో ఈఎమ్ఈ సెయిలింగ్ అసోషియేషన్ కమడోర్, లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్, వైఎస్ కమడోర్ జేఎస్ సిధాన, ఎస్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రఘురాంరెడ్డి, ఉపాధ్యక్షుడు రాహుల్ రావు, అర్జున అవార్డు గ్రహీత రాజేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Satyavathi Rathod: 'ఏ ఒక్క చిన్నారి అనాథనని బాధపడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం'