రాఖీపౌర్ణమి వేడుకలను రాజ్‌భవన్‌లో వినూత్నంగా జరిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లాస్మాదాతలను సన్మానించి రక్షాబంధన్ నిర్వహించారు. జీవితాలను నిలబెట్టిన వారికి రాఖీలు, మిఠాయిలు అందించడంతోపాటు శాలువాలతో సన్మానించారు. రాజ్‌భవన్ దర్బారు హాల్లో జరిగిన కార్యక్రమంలో 13 మంది ప్లాస్మా దాతలను తమిళిసై అభినందించారు.
పలుమార్లు ప్లాస్మా దానం
ప్లాస్మా దాతలు తమ అనుభవాలను వివరించడంతోపాటు తామూ ఎలా స్ఫూర్తి పొందామో వివరించారు. ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ప్లాస్మాను దానం చేసిన వారిని గవర్నర్ ప్రశంసించారు. ఇతరులను కూడా ప్రోత్సహించాలని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మార్లు ప్లాస్మా దానం చేసిన ముంబయి ఐఐటీ విద్యార్థి నితిన్ కుమార్‌ను తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు. రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన శివప్రతాప్, ఉమర్ ఫారూఖీ, అఖిల్, రూపదర్శిని తదితరులు రెండు మార్లు ప్లాస్మా దానం చేశారు.
విపత్కర సమయంలో విధులు
రాష్ట్రంలో మొదట ప్లాస్మా దానం చేసిన అఖిల్... మరో 120 మందిని కూడా సమన్వయ పరిచారు. దాతలంతా రాజ్ భవన్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని తమిళిసై అన్నారు. వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారని చెప్పారు. విపత్కర సమయంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల సేవలను కొనియాడారు.
ప్రభుత్వాసుపత్రుల్లోనే అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారన్న గవర్నర్.. ప్రజలు ఎలాంటి అనుమానం లేకుండా గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్లవచ్చన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మానవతా దృక్పథంతో ఎక్కువ ధరలు వసూలు చేయకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందించాలన్నారు.
ఇదీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'