Governor Tamilisai wishes Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తోటి మహిళలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. మనం సంస్కృతిలో మహిళలను శక్తి స్వరూపంగా భావిస్తామని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించాల్సి ఉందని గవర్నర్ తమిళిసై.. కుటుంబ సంరక్షణ మొదలు దేశ నిర్మాణం వరకు స్త్రీ శక్తిమంతురాలని పేర్కొన్నారు.
CM KCR wishes on Women's Day: మహిళా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం.. అతివలకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సగ భాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని చెప్పారు.
Women's Day 2023: స్త్రీ శక్తిని చాటేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు వారి గౌరవాన్ని మరింత పెంపొందిస్తూ, స్త్రీ జనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. 9 ఏళ్ల పాలనలో మహిళాభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి.. జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోందని కేసీఆర్ వివరించారు. తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 27 మంది నారీమణులను ఈ సందర్భంగా.. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి సన్మానించనున్నారు.
విశిష్ట మహిళా పురస్కారం కింద రూ.లక్ష నగదు, జ్ఞాపికలు వారు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్‌రావు ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొననున్నారు. అతివలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రధాని, యూపీఏ ఛైర్ పర్సన్, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్‌గా మహిళలకు అనేక పదవులను కాంగ్రెస్ ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు.
ఇవీ చదవండి: