అబ్దుల్ కలాం రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం భారత దేశానికి, ముఖ్యంగా యువతకు తీరని అన్యాయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఐదో వర్ధంతి సందర్భంగా ఏపీజే కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సహన శీలమైన, సుందర సమాజ నిర్మాణమే కలాంకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తమిళిసై అన్నారు. ఎక్కడైతే ఇతరుల అభిప్రాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, వేషభాషలను గౌరవిస్తారో అదే సుందరమైన సమాజమని... కష్టించి పని చేయడాన్ని కలాం ఎంతగానో అభిమానించేవారని తెలిపారు.
తనను భారత రాష్ట్రపతిగా, మిస్సైల్ సైంటిస్ట్ గా, ఆవిష్కర్తగా, రచయితగా కాకుండా ఒక టీచర్‌గా గుర్తుంచుకోవాలని కలాం చెప్పేవారని.. తమిళిసై తెలిపారు. ఆయన రెండోమారు రాష్ట్రపతి అయి ఉంటే దేశానికి, యువతకు ఎంతో మేలు జరిగేదని వివరించారు. కలాంను ఎంతో అభిమానించే ప్రధాని నరేంద్రమోదీ.. ఆయన విజన్, లక్ష్యాలను సాకారం చేసేందుకు డిజిటల్ ఇండియా మిషన్, ఆత్మనిర్భర భారత్ ద్వారా స్వయం సమృద్ధి భారతానికి, భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని గవర్నర్ తెలిపారు.